బెజ్జంకిలో ఘనంగా ముగిసిన శకటోత్సవం
బెజ్జంకి (CLiC2NEWS): చైత్ర శుద్ధ పౌర్ణిమ సందర్భంగా గురువారం (ఏప్రిల్ 2, 2026) బెజ్జంకి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిర్వహించిన శకటోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన బెజ్జంకి జాతర మరోసారి భక్తి, భవ్యం, సంప్రదాయాల సమ్మేళనంగా వెలుగొందింది.
దశాబ్దాల చరిత్రను సాక్షిగా నిలబెట్టుకున్న బెజ్జంకి ఏకశిలా గుట్ట చుట్టూ జరిగిన ఈ శకటోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతర జరుగుతున్న వారం రోజుల పాటు పరిసర గ్రామాలన్నీ పండుగ వాతావరణంలో మునిగిపోయాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకూ జానపద గీతాలు ఆలపిస్తూ గుంపులుగా జాతరకు తరలివచ్చిన భక్తుల సందడి ఆహ్లాదకరంగా మారింది.
శకటోత్సవం రోజున వివిధ రకాల ఎడ్ల బండ్లు గుట్ట చుట్టూ తిరుగుతూ భక్తి శ్రద్ధలను ప్రతిబింబించాయి. పశుసంపద గొప్పతనాన్ని చాటేలా అలంకరించిన ఎడ్ల బండ్లు పరుగులు తీస్తూ కనిపించగా, వాటిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎడ్ల బండ్లతో పాటు కార్లు, ట్రాక్టర్లు, బైక్‌లతో యువత గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ “జై నారసింహ” నినాదాలతో మార్మోగించారు. ఈ దృశ్యాలు భక్తుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.
మేకల బండ్లు ప్రత్యేక ఆకర్షణ
ఈ శకటోత్సవంలో మేకల బండ్లు పాల్గొనడం ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. భక్తులు తమ మొక్కులు తీర్చుకునే భాగంగా ఇలాంటి విభిన్న రూపాల్లో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం.
మొత్తం మీద, పల్లె సంస్కృతి, భక్తి తత్వం, జానపద సంప్రదాయాల సమ్మేళనంగా నిలిచిన బెజ్జంకి శకటోత్సవం భక్తులను మాత్రమే కాకుండా సందర్శకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది.
-ఎస్.వి.రమణా చార్య
సినియర్ జర్నలిస్టు
సెల్: 98498 87086
Also Read: నేడే శకటోత్సవం


