పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై మంచిర్యాలలో ర్యాలీ
మంచిర్యాల: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరిస్తున్నాయని తెలంగాణ 3/4 వీలర్స్ ఆటోట్రాలీ మినీగూడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో భారీ ర్యాలీ నిర్హించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు శంకర్, నరేష్‌లు మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారన్నారు. పెట్రోల్ ధరలకు తోడుగా డీజిల్ ధరల ప్రభావం నిత్యావసర వస్తువులపై పడడంతో బ్రతుకు బండి నడపడం కష్టమవుతుందని వాపోయారు. ఈ పెరిగిన ధరలు సామాన్యుడి నడ్డి విరిస్తున్నాయని.. ఈ కరోనా కాలంలో కష్టపడితేనే గానీ కడుపు నిండని మా బ్రతుకులకు చమురు ధరల పెరుగుదల మూలిగే నక్కపై తాటికాయ పడినట్టుందన్నారు. పెట్రోల్ ధర వంద రూపాయలు, డీజిల్ 95 రూపాయలుకు చేరడంతో వాహనాలు నడపడం చాలా కష్టంగా ఉందని వాపోయారు. ప్రభుత్వాలు మాలాంటి వారి కష్టాలను దృష్టిలో ఉంచుకుని ధరలను అదుపులోకి తేవాలని, అలాగే మినీ గూడ్స్ 3/4 వీలర్స్ డ్రైవర్ల సమస్యలను పరిష్కారించాలని కోరారు. పెరిగిన ధరలకు నిరసనగా ఆర్.టి.ఒ. కార్యాలయం వరకు భారీగా వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాలు మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు బెల్లంపల్లి, మందమర్రిలలో కూడా నిర్వహించారు.
