తరగతుల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం: సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తరగతులు కొనసాగించాలో.. సెలవులు ఇవ్వాలో అనే అంశంపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడారు. ఇప్పటికే రెసిడెన్షియల్ హాస్టల్స్, కొన్ని పాఠశాలల్లో కరోనా వ్యాప్తి చెందింది. మన పిల్లలను మనమే చెడుగొట్టుకోవద్దు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఈ రెండు, మూడు రోజుల్లో తానే స్వయంగా పాఠశాలల నిర్వహణపై శాసనసభ వేదికగా ప్రకటన చేస్తానని చెప్పారు. ఈ మధ్య కాలంలో కొన్ని గురుకుల హాస్టళ్లల్లో, మంచిర్యాల బాలికల పాఠశాలలో కొన్ని కరోనా కేసులు ఎక్కువ వచ్చాయి. కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నాయి. కరోనాను అదుపులో ఉంచేందుకు యత్నిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కరోనాను కంట్రోల్ చేసేందుకు వైద్యాశాఖ అధికారులు తీవ్రమైన కసరత్తు చేస్తోందన్నారు.