టిఆర్ఎస్‌లోకి మారి రెండేళ్లయినా.. అభివృద్ధి శూన్యం: కాంగ్రెస్ నాయకులు
ఎల్లారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో గెలిచి, నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే జాజాల సురేందర్ చేరి రెండేళ్లు గడిచినా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేతలు విమర్శించారు. శనివారం ఎల్లారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముందు కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పై ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఓవైపు వారి వారి నియోజకవర్గల అభివృద్ధి కోసం స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశములో ప్రభుత్వానికి తమ సమస్యలను వివరిస్తుంటే.. ఈ ఎమ్మెల్యే మాత్రం నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమల సాగర్ లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. కాగా, రోజు రోజు కు ప్రజల్లో తనపై వస్తున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అధికార పార్టీలో ఉండి… నియోజకవర్గ పరిధిలో `పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు నెల రోజుల్లో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చాలేదని` వారు ప్రశ్నించారు. ఈ ఎమ్మెల్యే కేవలం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీకి పరిమితం అయ్యారని అన్నారు. ఎమ్మెల్యే సురేంధర్ ఇప్పటికయినా నియోజకవర్గ అభివృద్ధి చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. నిరసన ప్రదర్శన చేస్తున్న కాంగ్రెస్‌నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.