మాస్కులు తప్పనిసరి.. తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

హైదరాబాద్‌ : తెలంగాణ లో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణచట్టంలోని 51 నుండి 61 వరకు గల సెక్షన్ల కింద అదేవిధంగా ఐపీసీ 188తో పాటు ఇతర సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.

రాష్ట్రంలో ర్యాలీలు, ఒకేచోట ప్ర‌జ‌లు గుంపులుగా ఉండ‌టంపై ఆంక్ష‌లు విధించింది. ఏప్రిల్ 30 వ‌ర‌కు ఎలాంటి ర్యాలీలు, ఉత్స‌వాల‌కు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేసింది. బ‌హిరంగ ప్ర‌దేశాలు, పార్కుల్లో ఎలాంటి స‌మావేశాలు నిర్వ‌హించ‌రాద‌ని పేర్కొంది. హోలీ, ఉగాది, శ్రీ‌రామ‌న‌వ‌మి, మ‌హావీర్ జ‌యంతి, గుడ్ఫ్రైడే, రంజాన్ త‌దిత‌ర సంద‌ర్భాల్లో ఎలాంటి మ‌త‌పర‌మైన కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌రాద‌ని తెలిపింది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై కఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. మాస్క్‌ నిబంధన కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Leave A Reply

Your email address will not be published.