మంచిర్యాలలో దారుణం: భర్తకు కరోనా సోకిందని భార్య..
మంచిర్యాల: కరోనా మహమ్మారి దెబ్బకు పచ్చని కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. ఒక ఇంట్లో ఒకరికి కరోనా సోకితే ఆ ప్రభావం మొత్తం ఇంటిపై పడుతున్నది. తాజాగా భర్తకు కరోనా సోకిందని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన సుద్దాల మొండయ్యకు రెండు వారాల కిందట కరోనా సోకింది. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల కిందట మొండయ్య భార్య జలజ కూడా కరోనా భారిన పడ్డారు. ఈ క్రమంలో భర్తకు కరోనా సోకిందనే మనస్తాపంతో మంగళవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై బెల్లంపట్టి ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్త కరోనాతో ఆసుపత్రిలో ఉండటం, భార్య ఆత్మహత్య చేసుకోవడంతో బెల్లంపల్లిలో విషాదం నెలకొన్నది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా మన పొరుగున్న ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న ఎనిమిది మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1780కి చేరిందని అధికారులు పేర్కొన్నారు. ఇక దేశంలో రోజూ లక్షల కేసులు నమోదవుతున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నా, మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు.