తెలంగాణలో టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు వాయిదా.. సర్కార్ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేయగా.. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేసింది. కరోనా ఉధృతి దృష్ట్యా రాష్ట్రంలో పరీక్షలను రద్దు చేసింది.
ఈ మేరకు విద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ప్రకటించారు. ఎస్ఎస్ఈ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్ విధానం ద్వారా ఫలితాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది. పరిస్థితులు మెరుగయ్యాక పరీక్షలు రాసేందుకు అవకాశమిస్తామని వెల్లడించింది.
తెలంగాణలో దాదాపు 5.35 లక్షల మంది పదో తరగతి విద్యార్ధులు ఉన్నారు. వీరందరినీ కూడా గ్రేడింగ్ ఆధారం పైతరగతులకు ప్రమోట్ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ సీఎం కేసీఆర్‌కు పంపారు. ఆ ఫైల్‌పై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదముద్ర వేశారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ మే 29 నుంచి జూన్ 7 వరకు ఉంటాయని ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇంటర్ పరీక్షల నిర్వహణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.
