కాకర్ల సుబ్బారావు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. నెల రోజుల క్రితం అనారోగ్యంతో కిమ్స్‌లో చేరారు. శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మరణించినట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్‌గా సేవలందించిన కాకర్ల సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల చదువు చల్లపల్లి, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో సాగింది. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి ఆయన డాక్టర్ పట్టా పొందారు. 1951లో హౌస్ సర్జన్ చేసిన తర్వాత వైద్యంతో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లారు. రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1954 నుంచి 56 వరకు పనిచేశారు. 1956లో ఇండియాకు వచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. ఆతర్వాత ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు.
1986లో ఎన్టీ రామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరకు కాకర్ల స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను అభివృద్ధి చేశారు. ఆయన వైద్య శాఖకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 సంవత్సరంలో పద్మశ్రీ పొందారు.