కుంభమేళా: 30 మంది సాధువులకు కరోనా
హరిద్వార్: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న పవిత్ర కుంభమేళాపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పటికే అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో బయటపడుతున్నాయి. తాజాగా కుంభమేళాలో పాల్గొన్న 30 మంది సాధువులకు కరోనా సంక్రమించినట్లు తేలింది. ఆల్ ఇండియా అఖడా పరిషత్ నాయకుడు మహంత్ నరేంద్ర గిరి కూడా కరోనాతో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేరారు.
ఈ విషయాన్ని హరిద్వార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్‌కే జా తెలిపారు. అఖాడాలకు వైద్య బృందాలు వెళ్తున్నాయని, అక్కడ ఉండే సాధువులకు ఆర్‌సీ పీసీఆర్ పరీక్షలు నిరంతరం చేస్తున్నారని ఆయన తెలిపారు. హరిద్వార్‌లో క్రిటికల్‌గా ఉన్న కేసులను రిషికేశ్‌లో ఉన్న ఎయిమ్స్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. స్థానిక ప్రజలను మాత్రం హోం ఐసోలేషన్‌లోకి పంపిస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని హాస్పిటల్‌లో చేర్పిస్తున్నారు. హరిద్వార్‌లో ఉన్న హాస్పిటళ్లలో ఎటువంటి ఆందోళనకర పరిస్థితి లేదన్నారు.
హరిద్వార్‌లో నిన్న ఒక్క రోజే 600 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. అక్కడ ఉన్న నిరంజనీ మఠం ఈ నేపథ్యంలో ఓ హెచ్చరిక జారీ చేసింది. కుంభమేళాలో పాల్గొంటున్న సాధువులంతా వెళ్లిపోవాలంటూ పేర్కొన్నది. నిరంజనీ అఖారా కార్యదర్శి రవీంద్ర పురి మాట్లాడుతూ.. పెరుగుతున్న కోవిడ్ కేసుల వల్ల హరిద్వార్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, గంగా నదిలో పుణ్యం స్నానం చేసిన సాధువులంతా తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలంటూ కోరామని చెప్పారు. హరిద్వార్‌లో సుమారు 13 అఖారాలు ఉన్నాయి. వాటిల్లో లక్షలాది మంది సాధువులు ఉంటున్నారు.
ప్రముఖ సాధువు కన్నుమూత
ఇదిలా ఉండగా.. మహా నిర్వాణి అఖడా హెడ్ ప్రముఖ సాధువు స్వామి కపిల్ దేవ్ కొవిడ్‌తో ప్రాణాలుకోల్పోయారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చికిత్స నిమిత్సం రిషికేష్‌లో చేరారు. పరిస్థితి విషయమించడంతో అక్కడి నుంచి డెహ్రడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ గురువారం తుదిశ్వాస విడిచారు.