పవన్ కళ్యాణ్‌కు కొవిడ్ పాజిటివ్..
కొనసాగుతున్న చికిత్స.. అధికారికంగా ప్రకటించిన జనసేన టీం
హైదరాబాద్: సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆయన స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోందని జనసేన టీం అదికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పవన్ ఆరోగ్యంగానే ఉన్నారని… వైద్యులు చికిత్స అందిస్తున్నారని ప్రకటనలో తెలిపారు.
“జనసే అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈనెల 3న తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని పవన్ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్టు చేయించుకోగా నెగటివ్ వచ్చింది. అయినా వైద్యుల సూచన మేరకు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా కొద్ది పాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతుంటంతో మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవడంతో ఫలితం పాజిటివ్ అని వచ్చింది. ప్రముఖ కార్డియాలజిస్టు తంగెళ్ల సుమన్ ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో కాస్త నిమ్ము చేరడంతో యాంటీ వైరల్ మదులతో చికిత్స అందిస్తున్నారు.“
“పవన్ కల్యాణ్‌కు పాజిటివ్ అని తెలియడంతో ఆయన సోదరుడు చిరంజీవితో పాటు సురేఖ, రామ్‌చరణ్, ఉపాసన, నిర్మాత నాగవంశీలు ఎప్పటికప్పుడు పవన్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అపోలో నుంచి కూడా ఒక వైద్య బృందం పవన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తారని పవన్ కల్యాణ్ తెలిపారు.“ అని జనసే పార్టీ తెలిపింది.