Mandapeta: కరోనా నుంచి కోలుకున్న చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి

మండపేట (CLiC2NEWS): మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల ఆమెకు జ్వరంగా ఉండి వైద్య పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం నెగిటివ్ రిపోర్టులు రావడంతో మంగళవారం పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ రాణి మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రజల ఆశీస్సులతో వైరస్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మండపేట వచ్చానని అన్నారు. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కరోనా వైరస్ సమాజాన్ని నాశనం చేస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. వైరస్ ను దృష్టిలో ఉంచుకొని మరికొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలి అన్నారు. పొరపాటున వైరస్ కు చిక్కుకుంటే ఆసుపత్రి లో బాధలు వర్ణనాతీతం అన్నారు. సామాన్యుల పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉంటుంది అన్నారు. అందుచేత లాక్ డౌన్ సడలింపు సమయంలో పనులు ముగించుకొని త్వరగా ఇళ్లకు చేరుకుంటే మంచిది అన్నారు. పట్టణంలోని వ్యాపారులు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలి అన్నారు. వ్యాపార సమయాల్లో వ్యాపారస్తులు నిబంధనలు మేరకు కార్యకలాపాలు సాగించాలి అన్నారు. వ్యాపార సంస్థల దగ్గర వినియోగదారులకు సురక్షిత దూరం పాటించమని చెబుతూ ప్రతి షాపు వద్ద శానిటైజర్ బాటిల్స్ అందుబాటులో ఉంచాలి అన్నారు. ప్రజలు , వ్యాపారస్తులు సంయుక్తంగా కలిసి నిబంధనలు పాటిస్తే కరోనాను తరిమికొట్టొచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ఆంక్షలు పాటిస్తూ మాస్కు , భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహరించాలని ఆమె కోరారు. పట్టణ ప్రజలు వైరస్ బారిన పడకుండా జీవించాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.