ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి : గవర్నర్ తమిళిసై
మహేశ్వరం (CLiC2NEWS): మండల పరిధిలోని కేసీ తండా అంగన్వాడీ కేంద్రంలో సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గిరిజనులతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి.. కరోనా నుంచి రక్షణ పొందాలి అని గవర్నర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు సమావేశంలో గవర్నర్ తెలుగులో ప్రసంగించారు…
మీ అందర్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. గిరిజన ప్రజలంటే తనకు చాలా అభిమానం, ప్రేమ అని చెప్పారు. గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతోందని తెలిసింది. మీకందరికి ధైర్యం చెప్పేందుకు కేసీ తండాకు వచ్చాను. అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. మనందరం వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్‌ను జయించొచ్చు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి.. ఇతరులకు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పాలి. నేను కేసీ తండాలో వ్యాక్సిన్ తీసుకొని విన్నపం చేస్తున్నాను.. అందరూ వ్యాక్సిన్ తీసుకోని కొవిడ్ నుంచి రక్షణ పొందాలి అని గవర్నర్ తమిళిసై సూచించారు.

మహేశ్వరం శివ గంగ ఆలయంలో గవర్నర్ తమిళిసై పూజలు
కెసి తండాకు వెళ్లడానికి ముందు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మహేశ్వరం శివ గంగ ఆలయంలో సోమవారం ఉదయం పూజలు చేశారు. సోమవారం ఉదయం మహేశ్వరంకు వచ్చిన గవర్నర్ కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలకు ఆషాడ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.