మండ‌పేట‌లో ఘ‌నంగా తొలి ఏకాద‌శి..

భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో విశేష పూజలు..

మండపేట (CLiC2NEWS): తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండపేట పట్టణంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిట‌కిట‌లాడాయి. రథంగుడి శివాలయం, కలువపువ్వు సెంటర్ కనకదుర్గ గుడి, వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు దేవుళ్ళు విశేష పూజలు అందుకున్నారు. వాణీమహల్ భక్తాంజనేయ స్వామి వారు పుష్ప అలకరణలతో ప్రత్యేకంగా ఆకర్షించారు. ఆంజనేయ స్వామి వారికి తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు ఖండవల్లి పవన్ కుమార్ స్వామి వారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకం, సుగంధ ద్రవ్యాలు అభిషేకాలు నిర్వహించి స్వామి వారికి సేవలు చేశారు. స్వామి భక్తుడు ఒకరు భక్తితో స్వామి వారికి 108 వెండి తమల పాకులు సమర్పించి స్వామి కృపకు పాత్రుడు అయ్యారు. వేకువ జామున భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకొని పూజారులు ఆశీర్వచనాలు అందుకున్నారు. అర్చకులు పవన్ కుమార్ మాట్లాడుతూ తొలి ఏకాదశి పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. తొలి ఏకాదశి నీ శయన ఏకాదశి అంటారని అన్నారు. తొలి ఏకాదశి రోజున హరిహరాదులు ఉత్తరాయణం నుండి దక్షిణాయనం లోకి ప్రవేశిస్తారని, స్వామి వారి కదలిక వల్ల తొలి ఏకాదశి రోజు నుండి నాలుగు నెలలు అనగా జనవరి నెల వరకూ శుభ దినాలుగా పురాణాలు చెబుతున్నాయి అన్నారు. ఈ నాలుగు నెలలు మంగళ కరమైన రోజులుగా పండితులు చెబుతారని అందువల్ల ఈ నాలుగు నెలలు కూడా పండుగలు ఎక్కువగా వస్తాయని అన్నారు. భక్తాంజనేయ స్వామికి మంగళవారం ఎంతో ఇష్టమని దీనికి తోడు తొలి ఏకాదశి కలిసి రావడం ఎంతో విశేషమైన రోజుగా అభివర్ణించారు. స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన చాతుర్మాస దీక్షలు సైతం తొలి ఏకాదశి రోజు నుండే ప్రారంభ మవుతాయని తెలిపారు. పీతాధిపతులు, వేద పండితులు నేటి నుండి దీక్షలు ఆరంభించి లోక కల్యాణం కోసం హోమాధి యాగాలు నిర్వహిస్తారని అన్నారు. కార్తీక పౌర్ణమి వరకూ ఈ యాగాలు నిర్విరామంగా సాగిస్తూ దైవారాధనలో పీఠాధిపతులు నిమగ్నమై ఉంటారని పవన్ కుమార్ వివరించారు.

Leave A Reply

Your email address will not be published.