ప్రపంచ దేశాల్లో డెల్టా వేరియంట్ల విజృంభణ
న్యూఢిల్లీ (CLiC2NEWS): డెల్టా వేరియంట్ల విజృంభణతో పలు ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. అమెరికాలో ప్రతిరోజూ లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో సింహభాగం కేసులు డెల్టావేరియంట్ కేసులు ఉండటంతో అగ్రరాజ్యం అప్రమత్తం అయింది. వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరిగిపోతుండటంతో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. దేశంలో మాస్క్‌ను తప్పనిసరి చేశారు.
జపాన్‌లోకి కీలక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించగా, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సెప్టెంబర్ చివరి వరకూ లాక్‌డౌన్ పొడిగించారు.
జపాన్‌లో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో 12 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. రాత్రి సమయంలో 8 గంటల తరువాత బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఆస్ట్రేలియాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే సిడ్నీలో లాక్‌డౌన్ అమలులో ఉన్నది. న్యూసౌత్‌వేల్స్‌లో మరోసారి 600 లకు పైగా కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, కర్ఫ్యూ వంటి కఠిన నిబంధనలు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కాగా గురువారం రోజున ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలకు పైగా కేసులు, 11 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.