ఆ నాలుగు మండలాలకు 2, 3 వారాల్లో దళిత బంధు నిధులు: సిఎం కెసిఆర్
ఆర్థిక, సామాజిక వివక్షను బద్దలు కొట్టేందుకే దళితబంధు: ముఖ్యమంత్రి
హైదరాబాద్ (CLiC2NEWS): దళితబంధు పథకం అమలుపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీల ఆర్థిక అవసరాలు, స్థితిగతులు పరిశీలిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రం నలుదిక్కులా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. చింతకాని, తుంగతుర్తి, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రంలో నలుమూల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై అత్యున్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..
హుజూరాబాద్, వాసాలమర్రితో సహా తెలంగాణలో తూర్పున ఉన్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు చేస్తున్నామని, వాసాలమర్రి, హుజూరాబాద్‌లో ప్రకటించిన మాదిరిగా నిధులు విడుదల చేస్తామన్నారు.
4 మండలాలకు కూడా 2, 3 వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 4 మండలాల్లోని అధికారులు గ్రామాలకు తరలాలి రావాలని ఆదేశించారు. దళితబంధు రూపకల్పన అసెంబ్లీ సాక్షిగా జరిగిందని సీఎం వివరించారు. దళితబంధు పథకం దేశంలో మునుపెన్నడూ, ఎవరూ చేయని వినూత్న ఆలోచన, ఈ పథకానికి రూపకర్తలం, కార్యకర్తలం మనమేనన్నారు.
స్వాతంత్ర్యానంతరం అరకొర అభివృద్ధి తప్పితే, దళిత గూడాల్లో గుణాత్మకమైన మార్పు ఇంకా రాలేదన్నారు. ఒక కుటుంబంలో ఎవరికైనా ఆపదవస్తే ఎట్లైతే ఆదుకుంటామో అదే స్ఫూర్తితో దళితులను యావత్ సమాజం బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధారించుకొని అమలు చేస్తున్న పథకం దళితబంధు అని స్పష్టం చేశారు.

దళితుల అభ్యున్నతి కోసం అధికారులు పేరంటల్ అప్రోచ్‌తో పని చేయాలని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాల వివక్షకు గురవుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన దళితులను దళితబంధు పథకం ద్వారా తల్లిదండ్రుల్లాగా ఆదుకోవాలన్నారు. వారితో అధికార దర్పంతో కాకుండా కన్నబిడ్డను ఎట్లైతే తల్లిదండ్రలు ఆలనా పాలనా చూస్తారో ఆ పద్ధతిలో వ్యవహరించాలన్నారు. ఈ పథకంలో సపొర్టు స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం గొప్పవిషయమన్నారు. ఇందుకోసం రక్షణ నిధిని ఏర్పాటు చేసిన విషయం సీఎం వివరించారు.
ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, హన్మంత్ షిండే, ఎంపీ, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, ఖమ్మం జడ్పీ ఛైర్ పర్సన్లు, పాల్గొన్నారు.
అలాగే సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు, ఎస్సీ డెవలప్ మెంట్ కార్యదర్శి, సీఎం సెక్రెటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పోరేషన్ ఎండీ కరుణాకర్, టీఎస్ఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వర్ రావు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సూర్యాపేట్ కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, జితేష్ వి.పాటిల్, పి. ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.