నీడ కోసం ‘రథంబడి’ విద్యార్ధుల వినతి
మండపేట (CLiC2NEWS) : పట్టణంలో జవహర్ లాల్ మున్సిపల్ హైస్కూల్ (రథం బడి)కి ఓ ప్రత్యేకత ఉంది. పట్టణానికి నడిబొడ్డున ఉండటం, చుట్టు పక్కల దాదాపు 5,6 వార్డుల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజలు తమ పిల్లలను బడికి పంపడానికి అనువుగా ఉండే పాఠశాల కావడం, నాణ్యమైన విద్యాబోధన అందించే అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యార్ధులకు పాఠాలు చెప్పడం వంటి అంశాలు కలిసి రావడంతో రథంబడికి విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు సైకిల్ వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్ధులు అధికంగా సైకిళ్ల మీద పాఠశాలకు రావడంతో సైకిళ్లు పెట్టుకునే చోటు లేక అవస్థలు పడుతున్నారు. రథంబడికి ముందున్న ఖాళీ స్థలంలోనే పార్కింగ్ చేసి తరగతులకు వెళ్తున్నారు. ఈ లోగా సాయంత్రం వరకూ ఆ సైకిళ్లు ఎండకు ఎండి వానకు తడిసి తొందరగా పాడై పోతున్నాయి. ప్రతి సారి సైకిళ్లు రిపేరుకు రావడంతో సైకిల్ మెకానిక్ వద్దకు తీసుకెళ్లడం జరుగుతుందని అక్కడే ఎక్కువ సమయం సరిపోతుందని విద్యార్ధులు వాపోతున్నారు. చిన్నా మధ్య తరగతి కుటుంబాలు కావడంతో పిల్లల తల్లిదండ్రులకు కూడా భారంగా ఉంటుందని చెబుతున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి, దాతలు స్పందించి షెడ్డు నిర్మించి విద్యార్థుల సైకిళ్లకు నీడను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.