`సీతారామ`తో ఉమ్మడి ఖమ్మం లబ్ధి
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
హైదరాబాద్ః సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం లబ్ది పొందుతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే ప్రతిష్టాత్మక సీతారామ ప్రాజెక్ట్ పనులపై హైదరాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో మంగళవారం సమావేశం జరిగింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాబాద్ కి కూడా సాగు నీరు అందించాలనే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అన్నారు. సీతారామ కింద ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ప్రతిపాదిత ఆయకట్టుకు, మహబూబాబాద్ జిల్లా లోని 1.20 లక్షల ఎకరాలు అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్చింస్తున్నట్లు పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.54లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 1.20 లక్షల మొత్తం 7.74లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నామని ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం లబ్ది పొందుతుందన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లాలోని 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తద్వారా లక్షల ఎకరాలు గోదావరి జలాలతో తడవనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీతారామ వర ప్రదాయిని ప్రాజెక్టు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ప్రతి రైతు ఎకరాని తడిపి రైతుల మోములో చిరునవ్వును చూడాలని సీఎం కేసిఆర్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రిన్సిపాల్ సెక్రటరీ రజత్ కుమార్, మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత, రాష్ట్ర విప్ రేగ కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్య రాములు నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, ఇఎన్సీ మురళి కృష్ణ, సీతారామ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జిల్లాల కలెక్టర్లు, కర్ణన్, ఎంవి రెడ్డి, సిఇలు, ఎస్ఇలు ఇతర అధికారులు హాజరయ్యారు
