ఆస్తులన్నీ ఆన్‌లైన్‌లోకి

నేడు మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి ఆస్తి వివరాలు ఇక పక్కాగా ఆన్‌లైన్‌లో నమోదు కానున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్‌ లైన్‌లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్‌ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోపే మున్సిపల్, పంచాయతీ రాజ్‌ శాఖలకు చెందిన అన్నిస్థాయి ల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు నమోదు కాని ఆస్తుల వివరాలను వెంటనే 100% ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు. నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్‌ రూపకల్పనపై మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

 

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలు, గ్రామ పంచాయతీలు, పురపాలికలు, పురపాలక సంస్థల ఆస్తుల వారీగా వివరాలను యంత్రాంగం సేకరించాలన్నారు. ప్రతి ఆస్తికీ పన్ను వివరాలతోపాటు నల్లా బిల్లు, యజమాని ఆధార్‌ కార్డు వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఈ ప్రక్రియను మునిసిపల్‌ అధికారులు, జిల్లా, మండల, పంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలు కూడా ఇందుకు ముందుకు రావాలని, అధికారులకు పూర్తి వివరాలు అందించాలనిచెప్పారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని సీఎం కోరారు. భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుడుతున్నా మని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.

వెబ్‌సైట్‌ను ఒక్కసారి ప్రారంభించాకా ఏమాత్రం లోటుపాట్లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొన్ని రోజులు ఆలస్యమైనా పరవాలేదని, లోపాల్లేకుండా చూడాలని సూచించారు. ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియతోపాటు గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం, డంప్‌ యార్డుల ఏర్పాటు, ప్రతి ఇంటికీ 6 మొక్కలు ఇవ్వడం సహా గ్రామాల్లో హరితహారం, చెత్త తరలింపు తదితర అంశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి ఫ్ల్లయింగ్‌ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.