రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద మ‌రింత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌

 

రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద‌కు ఇత‌రుల‌కు ‘నో ఎంట్రీ’

రిజ‌ర్వాయ‌ర్ల భ‌ద్ర‌త త‌నిఖీకి నాలుగు ఫ్ల‌యింగ్ స్వ్కాడ్లు

మూడు రోజుల పాటు సెక్యూరిటీ ఆడిట్‌

డైరెక్ట‌ర్ల‌తో ఎండీ దాన‌కిశోర్ స‌మీక్ష‌

హైద‌రాబాద్‌(CLiC2NEWS): ముషీరాబాద్ ప‌రిధిలోని రిసాల‌గ‌డ్డ వాట‌ర్‌ట్యాంక్ వ‌ద్ద జ‌రిగిన సంఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్ పేర్కొన్నారు. రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద భ‌ద్ర‌త‌కు, ప్ర‌జ‌ల‌కు శుద్ధ‌మైన తాగునీరు అందించేందుకు జ‌ల‌మండ‌లి అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటోంద‌ని, అయినా కూడా ఇలాంటి ఘ‌ట‌న జరిగింద‌న్నారు. ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు వంద‌లాది రిజ‌ర్వాయ‌ర్లు, వాట‌ర్ ట్యాంకుల ద్వారా ప్ర‌జ‌ల‌కు జ‌ల‌మండ‌లి మూడంచెల క్లోరినేష‌న్ ప్ర‌క్రియ‌తో నాణ్య‌మైన నీటిని స‌ర‌ఫ‌రా చేస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే జ‌ల‌మండ‌లి రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద ప‌టిష్ట‌మైన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ఉంద‌ని, దీనిని మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. రిజ‌ర్వాయ‌ర్లు, వాట‌ర్ ట్యాంకుల వ‌ద్ద‌ అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప‌టిష్టమైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఈ మేర‌కు గురువారం ఖైర‌తాబాద్‌లోని జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో డైరెక్ట‌ర్ల‌తో ఎండీ దాన‌కిశోర్ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు.

అన్ని రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద 24 గంట‌ల భ‌ద్ర‌త‌

ఇక మీద‌ట న‌గ‌రంలో రిసాల‌గ‌డ్డ లాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా మ‌రింత‌ అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఉన్న‌ట్లు ఎండీ దాన‌కిశోర్ అభిప్రాయ‌ప‌డ్డారు. న‌గ‌రంలో ఉన్న రిజ‌ర్వాయ‌ర్లు, వాట‌ర్‌ట్యాంకుల వ‌ద్ద మ‌రింత క‌ట్టుదిట్టమైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాలని ఆయ‌న నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే కోర్ సిటీలో 378 స‌ర్వీస్ రిజ‌ర్వాయ‌ర్లు ఉండ‌గా, దాదాపు 100 రిజ‌ర్వాయ‌ర్ల ప్రాంగ‌ణాల్లోనే కార్యాల‌యాలు ఉన్నందున వాటిల్లో ఇప్ప‌టికే 24 గంట‌ల భ‌ద్ర‌త ఉంద‌న్నారు. మిగ‌తా 278 రిజ‌ర్వాయ‌ర్ల‌కు ఇప్పుడు పాక్షికంగా భ‌ద్ర‌త ఉంద‌ని గుర్తించామ‌ని, వీటివ‌ద్ద కూడా 24 గంట‌ల భ‌ద్ర‌త ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

ఇత‌రులు ప్ర‌వేశించ‌కుండా చ‌ర్య‌లు

న‌గ‌రంలోని రిజ‌ర్వాయ‌ర్ల ప్రాంగ‌ణాల‌కు, వాట‌ర్ ట్యాంకుల వ‌ద్ద‌కు ఇత‌రులు రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎండీ దాన‌కిశోర్ ఆదేశించారు. ఎలివేటెడ్ రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద పైకి వెళ్లే మెట్ల ద‌గ్గ‌ర గేట్లు అమ‌ర్చి తాళం ఏర్పాటు చేసి బ‌య‌టివారు రాకుండా చూడాలని సూచించారు. అన్ని రిజ‌ర్వాయ‌ర్ల ప్రాంగ‌ణాల బ‌య‌ట ఇత‌రులకు అనుమ‌తి లేద‌ని చెబుతూ నిషేధిత స్థలం అనే సూచిక‌ బోర్డులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. రిజ‌ర్వాయ‌ర్ల‌లోకి దిగ‌డానికి ఏర్పాటుచేసిన మూత‌లు, గేట్ల‌కు త‌ప్ప‌నిస‌రిగా తాళాలు వేయాల‌ని చెప్పారు.

రేపే 100 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల నియామ‌కం

రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద 24 గంట‌ల భ‌ద్ర‌త కోసం మ‌రో 100 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల‌ను రేపే నియ‌మిస్తున్న‌ట్లు ఎండీ చెప్పారు. ఇందుకోసం ఇప్ప‌టికే ఎజైల్ సంస్థకు టెండ‌ర్ ఖ‌రారైంద‌ని తెలిపారు. వీరితో పాటు జ‌ల‌మండ‌లిలోని వివిధ విభాగాల్లో సుమారు 200 మంది అద‌న‌పు సిబ్బందిని గుర్తించి, వీరికి కూడా 15 రోజుల్లో రిజ‌ర్వాయ‌ర్ల ప్రాంగ‌ణాల్లో భ‌ద్ర‌త‌ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ట్లు తెలిపారు. రిజ‌ర్వాయ‌ర్ల త‌నిఖీకి నాలుగు ఫ్ల‌యింగ్ స్వ్కాడ్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ఫ్ల‌యింగ్ స్వ్కాడ్ల‌ను చీఫ్ విజిలెన్స్ ఆఫీస‌ర్ ర‌విచంద్ర‌న్‌రెడ్డి ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపారు. వీరు రాత్రి స‌మ‌యాల్లో కూడా రిజ‌ర్వాయ‌ర్ ప్రాంగ‌ణాల్లో ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌ను త‌నిఖీ చేస్తార‌ని చెప్పారు.

600 సీసీ కెమెరాల‌తో ప‌ర్య‌వేక్ష‌ణ‌

నెల రోజుల్లో అన్ని రిజ‌ర్వాయ‌ర్ల ప్రాంగ‌ణాల్లో 600కు పైగా సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసి నిరంత‌రం ప‌ర్య‌వేక్షించ‌డానికి ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సీసీ కెమెరాల‌ను స్థానిక‌ పోలీస్ స్టేష‌న్ల‌కు అనుసంధానం చేసే విష‌యంపై పోలీసు శాఖ‌తో సంప్ర‌దిస్తామ‌ని పేర్కొన్నారు.

3 రోజుల పాటు సెక్యూరిటీ ఆడిట్‌

దీనితో పాటు రానున్న 3 రోజుల పాటు సీజీఎంలు, జీఎంలు, విజిలెన్స్ అధికారుల ఆధ్వ‌ర్యంలో 21 బృందాలుగా ఏర్ప‌డి అన్ని రిజ‌ర్వాయ‌ర్లు, వాట‌ర్ ట్యాంకుల వ‌ద్ద‌ సెక్యూరిటీ ఆడిట్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. వీరు రిజ‌ర్వాయ‌ర్ల ప్రాంగ‌ణాల్లో చేప‌ట్టాల్సిన ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌పై సమ‌గ్ర‌ నివేదిక అందించాల‌ని ఆదేశించారు. ఈ నివేదిక‌ల‌ను పరిశీలించిన అనంత‌రం అవ‌స‌రమైన మరిన్ని భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఈడీ డా.ఎం.స‌త్య‌నారాయ‌ణ‌, టెక్నికల్ డైరెక్ట‌ర్ ర‌వికుమార్, ఆప‌రేష‌న్ డైరెక్ట‌ర్లు అజ్మీరా కృష్ణ‌, స్వామి, సీఈవో ర‌విచంద్ర‌న్‌రెడ్డి, సీజీఎంలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.