ప‌ని ప్ర‌దేశంలో భ‌ద్ర‌త.. ప్ర‌జలకు భ‌ద్ర‌త‌

భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించేలా జ‌ల‌మండ‌లి కొత్త నినాదం

హైదరాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో జ‌ల‌మండ‌లి చేప‌ట్టే వివిధ ప‌నులు జ‌రిగే ప్ర‌దేశాల్లో భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించేందుకు కొత్త వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తున‌ట్లు జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్ పేర్కొన్నారు. శ‌నివారం ఖైర‌తాబాద్‌లోని జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆయ‌న ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌త్యేక‌ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నూత‌న వ్య‌వ‌స్థ‌ను సంబంధించిన వివ‌రాల‌ను ఆయ‌న‌ వెల్ల‌డించారు.

సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్‌ల ఏర్పాటు

ప్ర‌భుత్వం.. ప‌ని ప్ర‌దేశాల్లో భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు క‌చ్చితంగా పాటించేలా, ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూడ‌టానికి ఇటీవ‌ల ప‌లు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేర‌కు జ‌ల‌మండ‌లి ఇప్ప‌టికే సేఫ్టీ అవేర్‌నెస్ వీక్‌, సేఫ్టీ ఆడిట్ నిర్వ‌హించిన‌ట్లు ఎండీ దాన‌కిశోర్ తెలిపారు. ఇప్పుడు ప‌ని ప్ర‌దేశాల్లో భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై మ‌రింత ప‌ర్య‌వేక్ష‌ణ కోసం కొత్త వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌స్తున్న‌ట్లు తెలిపారు. ప‌ని ప్ర‌దేశంలో భ‌ద్ర‌త‌.. ప్ర‌జల భ‌ద్ర‌త(వ‌ర్క్ సైట్ సేఫ్టీ ఈజ్ ప‌బ్లిక్ సేఫ్టీ)” అనే నినాదంతో సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు.

జ‌ల‌మండ‌లి చేప‌ట్టే పైప్‌లైన్ విస్త‌ర‌ణ‌, సీవ‌రేజ్ ప‌నులు, లీకేజీల నివార‌ణ ప‌నులు, మ్యాన్‌హోల్ మ‌ర‌మ్మ‌త్తులు, ఇలా ప్ర‌తి ప‌ని ప్ర‌దేశంలో భ‌ద్ర‌తా చ‌ర్య‌లు క‌చ్చితంగా పాటించేలా కొత్త నిఘా వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపారు. సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్స్(ఎస్‌పీటీ) పేరుతో ఆరు జ‌ల‌మండ‌లి స‌ర్కిళ్ల‌కు ఆరు బృందాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

ప‌ని ప్ర‌దేశంలో భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఇక‌ ప్ర‌త్యేక నిఘా

ప‌నులు జ‌రుగుతున్న అన్ని ప్ర‌దేశాల్లో ఏజెన్సీ/కాంట్రాక్ట‌రు పేరు, ఫోన్ నెంబ‌రు, ఈమెయిల్ ఐడీ వంటి వివ‌రాల‌తో కూడిన బోర్డుల‌ను జులై 5వ తేదీ లోగా ఏర్పాటు చేయించాల‌ని ఆయ‌న అధికారుల‌కు సూచించారు. ఈ వివ‌రాల‌తో క్యూఆర్ కోడ్‌లు కూడా బోర్డుల‌కు ఏర్పాటుచేయాల‌ని ఆదేశించారు. ప‌నులు జ‌రుగుతున్న ప్ర‌దేశాల జీఐఎస్ వివ‌రాలు సైతం ఎస్‌పీటీల‌కు అందుతాయ‌ని, వీటి ఆధారంగానే ఈ టీమ్‌లు ప‌ని ప్ర‌దేశాల‌కు వెళ్లి త‌నిఖీలు చేస్తాయ‌ని తెలిపారు. ప‌ని ప్ర‌దేశాల్లో ఎలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌వ‌ద్ద‌నే ఆలోచ‌న‌తోనే ఈ కొత్త వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.