విహారయాత్రలో విషాదం.. ఏడుగురు మహిళలు మృతి
చెన్నై (CLiC2NEWS): పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్లిన మహిళలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లాలో లారీ ఆగిఉన్న మినిబస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లూరు జిల్లాకు చెందిన 24 మంది ఓ మిని బస్సులో బయలు దేరి కర్ణాటక వెళ్లారు. పర్యాటక ప్రాంతాలను చూసి.. తిరుగు ప్రయాణమైన వారి బస్సు బెంగళూరు-చెన్నై జాతీయ రాహదారిపై ఆగిపోయింది.తిరుపత్తూరు జిల్లా నట్రంపల్లి సమీపంలో వాహనం నిలిపారు. దీంతో కొంతమంది మహిళలు బస్సుదిగి రహదారి పక్కన కూర్చున్నారు. వెనుక నుండి వస్తున్న లారీ ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా బస్సులో ఉన్న వారు సైతం గాయపడ్డారు.
రోడ్డు ప్రమాద ఘటన తెలిసి రాష్ట్ర సిఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50వేలు పరిహారం ప్రకటించారు.