అన్‌లాక్-5 నిబంధ‌న‌లు పొడిగింపు

నవంబరు 30 వరకు అన్‌లాక్-5 నిబంధనలే: కేంద్రం

న్యూఢిల్లీ : గ‌త నెల‌లో విడుద‌ల చేసిన అన్‌లాక్‌-5 మ‌ర్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్రం మ‌రో నెల పాటు పొడిగించింది. అక్కోబ‌ర్ నెల‌కు ప్ర‌క‌టించిన నిబంధ‌న‌ల‌నే న‌వంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు వ‌ర్తిస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) మంగళవారం ఈ ప్రకటనను జారీ చేసింది. ప్రజల ప్రయాణాలపైనా, సరుకు రవాణాపైనా ఎటువంటి ఆంక్షలు లేవని తెలిపింది. ప్రజలు రాష్ట్రం లోపల, ఇతర రాష్ట్రాలకు ప్రయాణించేందుకు, అదేవిధంగా సరుకులను రాష్ట్రం లోపల, ఇతర రాష్ట్రాలకు రవాణా చేసేందుకు ప్రత్యేకంగా అనుమతులు, ఈ-పర్మిట్లు పొందవలసిన అవసరం లేదని వివరించింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో నవంబరు 30 వరకు అష్టదిగ్బంధనం అమలు కొనసాగుతుందని స్పష్టం చేసింది. సెప్టెంబరు 30న ఎంహెచ్ఏ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో తెరిచేందుకు అనుమతి లభించింది. పాఠశాలలు, విద్యా సంస్థలను దశలవారీగా తెరవడంపై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు వదిలిపెట్టింది. కొన్ని షరతులకు లోబడి 100 మందికి పైగా సాంఘిక, మతపరమైన, రాజకీయ సభల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది.   క‌రోనాపై పోరాట‌మే ల‌క్ష్యంగా ఈ నెల 8న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రారంభించిన `జ‌న్ ఆందోళ‌న్‌` కార్య‌క్ర‌మంలో అంద‌రూ భాగ‌స్వాములు కావాల‌ని హోంశాఖ విజ్ఞ‌ప్తి చేసింది. మాస్క్‌లు ధ‌రించ‌డం, చేతులు త‌ర‌చూ శుభ్ర‌ప‌ర‌చుకోవ‌డం, క‌నీసం ఆర‌డుగుల భౌతిక దూరాన్ని పాటించ‌డం వంటి అంద‌రూ అమ‌లు చేయాల‌ని కోరింది.

Leave A Reply

Your email address will not be published.