రైతుల ఆశీర్వాదం వల్లనే సిఎం అయ్యా: సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): రైతాంగం అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని .. రైతుల ఆశీర్వాదం వల్లనే చిన్న వయస్సులోనే సిఎం అయ్యానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసా కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో సిఎం మాట్లాడారు. మా ప్రజా ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం రైతులేనని.. నేటితో రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. రైతులకు రుణమాఫి చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని, 25 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫి చేశామన్నారు. గత సిఎం వరి వేసుకుంటే ఉరి వేసుకోవడమే అన్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పామని.. అది 48 గంటల్లో జమ చేశామని తెలిపారు.
వ్యవసాయం అంటే రైతును రాజును చేయడమని.. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా గర్వంగా ఉందన్నారు. గత ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు నెత్తిన పెట్టారని.. రూ. లక్ష కోట్లతో కాళేశ్వర నిర్మాణం జరగడం.. అది కూలడం కూడా జరగిందన్నారు. కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావుకు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయన్నారు. రాష్ట్రం దివాలా తీస్తే వారు ఎలా సంపన్నులయ్యారని సిఎం ప్రశ్నించారు.
గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని కెసిఆర్‌కు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆధారాలు, సంతకాలతో అసెంబ్లీలో చర్చకు వస్తానని.. కెసిఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. అసెంబ్లీలో చర్చ కోసం స్పీకర్‌కు లేఖ రావాలి. ఒక రోజు గోదావరి.. రెండో రోజు కృష్ణా జలాలపై చర్చిద్దామని.. గతంలో సంతకాలు చేసిన కాగితాలు అసెంబ్లీ ముందు ఉంచుతానని సిఎం అన్నారు.