అక్రమంగా అమెరికాలోకి.. పట్టుబడ్డ 10వేల మంది భారతీయులు..
అగ్రరాజ్యంలో సరిహద్దుల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుండి మానవ అక్రమ రవాణా గణనీయంగా తగ్గినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి నుండి మే నెలల మధ్యలో 10,382 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ దొరికిపోయారు. వీరిలో పెద్దల సంరక్షణ లేని 30 మంది మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ డేటాను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం విడుదల చేసింది. గతేడాది ఇదే సీజన్ లో 34,535 మంది భారతీయులు పట్టుబడ్డారు. దీంతో పోల్చుకుంటే సుమారు 70% తగ్గుదల నమోదైంది.
దళారుల మాటలు విని అక్రమ మార్గాల్లో ప్రయాణించి భారతీయులు అమెరికాలోకి ప్రవేశించాలనుకుంటున్నారు. భారీ సరిహద్దు , కంచెలను తప్పించుకుని అగ్రరాజ్యంలోకి ప్రవేశించేందుకు ప్రమాదకరమైన సముద్ర మార్గంను ఆశ్రయిస్తున్నారు. ఇలా ప్రయాణిస్తూ మే 9వ తేదీన కాలిఫోర్నియాలోని డెల్ మార్ సమీపంలో పడవ బోల్తాపడి మృత్యువాత పడ్డ మైనర్లు ఇద్దరూ భారతీయులే. 2024 ఏప్రిల్ నాటికి డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటి లెక్కల ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎటువంటి పత్రాలు లేకుండా జీవిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి నుండి 332 మందిని అక్కడి నుండి వెనక్కి పంపారు. 2024లో తల్లిదండ్రులు వదిలేసిన 500 మంది మైనర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా-మెక్సికో, అమెరికా -కెనడా సరిహద్దుల్లో చాలా మంది తమ పిల్లలకైనా అమెరికా పౌరసత్వం వస్తుందన్న ఆశతో వారిని వదిలేసి వెళ్లేవారు. ట్రంప్ పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఇలా పిల్లలను వదిలేయడంపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.