సీఎం కేసీఆర్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రితో మరోసారి భేటీ అయ్యారు టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున. తెలుగు సినిమా అభివృద్ధి కోసం అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందంటూ ఇప్పటికే చాలా సార్లు చెప్పుకొచ్చారు మన స్టార్ హీరోలు. మరీ ముఖ్యంగా సిఎంతో ఏ పని ఉన్నా కూడా చిరంజీవి, నాగార్జున ముందుంటారు. తాజాగా ఈరోజు (శనివారం) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి కొన్ని విషయాలు చర్చించారు చిరు, నాగ్. ఆ మధ్య లాక్డౌన్ సమయంలో కూడా ఇలాగే ముఖ్యమంత్రిని కలిసారు ఈ ఇద్దరూ. ఇప్పుడు మరోసారి ఇదే చేసారు. ఈ మధ్య హైదరాబాద్‌ను అతలాకుతలం చేసిన వరదలలో ఎంతోమంది నష్టపోయారు.. ఆర్థికంగా కూడా వేల కోట్ల నష్టం వచ్చింది. ఇందులో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.. పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా పోయాయి. దాంతో వాళ్లను ఆదుకోడానికి తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. సిఎం రిలీఫ్ ఫండ్‌కు మన హీరోలు చాలా మంది లక్షలు, కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. వాటిని ముఖ్యమంత్రికి అందించడానికి కేసీఆర్ ను కలిసారు చిరంజీవి, నాగార్జున. అలాగే ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ హీరోలు ఇండస్ట్రీ తరఫు నుంచి ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలుస్తుంది.
కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకులతం అయిన విషయం తెలిసిందే. వరద భాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులంతా ముందుకు వచ్చారు. తెలంగాణలో వరద నష్టానికి సాయంగా చిరంజీవి రూ. కోటి, నాగార్జున రూ.50 లక్షలను ప్రకటించారు. వీరితో పాటు సూపర్ స్టార్ మహేశ్‌బాబు, ప్రభాస్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి చెరో కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు.