కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై కేంద్ర కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. కేబినెట్ సమావేశానంతరం ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు తెలిపారు.
ఎన్ఆర్ఏ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదంతో ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ ఏజెన్సీలకు వివిధ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునే ఇండియాలోని సుమారు 2.5 లక్షల మంది ఉద్యోగార్ధులు ఇప్పుడు ఒకే ఒక్క (సీఈటీ) పరీక్ష ఆన్‌లైన్‌లో రాస్తే సరిపోతుంది. ఇందులో వచ్చే మార్కులకు మూడేళ్ల పాటు చెల్లుబాటు (వాలిడిటీ) ఉంటుంది. దేశంలోని యువతకు కేంద్ర మంత్రివర్గ నిర్ణయం వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందని జవదేకర్ తెలిపారు.
ఇక ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో (పీపీపీ) మోడల్ కింద జైపూర్, తిరువనంతపురం, గౌహతి ఎయిర్‌పోర్టులను లీజుకు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేట్ డెవలపర్‌కు అప్పగించడం ద్వారా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు 1070 కోట్ల రూపాయలు సమకూరుతాయని మంత్రి తెలిపారు. ఈ మూడు ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిని చేసేందుకు కేంద్రప్రభుత్వం డెవలపర్‌గా అదానీ గ్రూప్‌ను ఎంపిక చేసింది.
మార్పులు
1.ప్రభుత్వ, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం వేర్వేరు పరీక్షలు అవసరం లేకుండా సింగిల్ ఆన్‌లైన్ సీఈటీకి హాజరైతే సరిపోతుంది.
2.సీఈటీలో సాధించిన మార్కులు ఫలితాలు ప్రకటించిన మూడేళ్ల వరకూ చెల్లుబాటులో ఉంటాయి.
3. తమ మార్కులు మెరుగుపరుచుకునేందుకు ప్రతి అభ్యర్థికి మరో రెండు అదనపు ఛాన్సులు ఉంటాయి. మూడింట్లో అధికంగా వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు.
4.ఎన్ఆర్ఏ ఇచ్చే సీఈటీ మెరిట్ లిస్ట్‌తో కాస్ట్-షేరింగ్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
5. ఇండియాలోని మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తరహాలోనే ఈ ఎన్ఆర్ఏ కూడా ఉంటుంది.