ఇప్పుడప్పుడే ఢిల్లీలో స్కూళ్లు ప్రారంభం కావు: సత్యేందర్‌ జైన్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో క‌రోనా విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనాకు చ‌లి తోడు కావ‌డంతో ఢిల్లీ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ వచ్చేంతవరకు ఢిల్లీలోని పాఠశాలలు తెరుచుకోవని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తెలిపారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే పాఠశాలలు తెరిచే ప్రణాళిక లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాతే పాఠశాలల పున:ప్రారంభం గురించి ఆలోచిస్తామని అన్నారు. 61వేల పరీక్షలు నిర్వహించినప్పటికీ.. బుధవారం కేవలం 5 వేల కేసులు మాత్రమే నమోదవుతున్నాయని అన్నారు. పాజిటివిటీ రేటు 8.49 శాతానికి పడిపోయిందని చెప్పారు. నవంబర్‌ 7న పాజిటివిటీ రేటు 15.2 శాతం ఉందని, గత మూడు వారాల నుండి పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తుందని చెప్పారు. రెండు వారాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం లేదా అంతకంటే తక్కువగా నమోదైతే కరోనా మహమ్మారి అదుపులోనే ఉంటుందని నిపుణులు వెల్లడించారని చెప్పారు. ఆర్‌టి – పిసిఆర్‌ పరీక్షలను కూడా క్రమంగా పెంచుతున్నామని 35 వేల శాంపిల్స్‌ను సేకరించామని అన్నారు. కరోనా మరణాల సంఖ్యను తగ్గించడానికి చేపట్టనున్న చర్యలపై ప్రభుత్వం నిపుణుల సలహాలను కోరింది. గత 10 రోజులుగా ప్రతిరోజు సుమారు 100 మంది మరణిస్తున్నారు. ప్రోటోకాల్స్‌లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.