కామారెడ్డి : జిల్లాలోని 70 గ్రామాలలో సమగ్ర రీ-సర్వే
కామారెడ్డి(CLiC2NEWS): జిల్లాలోని 70 గ్రామాలలో సమగ్ర రీ-సర్వే నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన భూ పరిపాలన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లోకేష్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న సమగ్ర రీ-సర్వే కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా సర్వే భూ రికార్డుల అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో భూ రికార్డుల ఆధునీకరణ, సరిహద్దుల నిర్ధారణ, రీ-సర్వే ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. జిల్లాలోని ప్రతి మండలంలో మూడు గ్రామాల చొప్పున మొత్తం 70 గ్రామాలను ఈ సమగ్ర రీ-సర్వే కార్యక్రమానికి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
సమగ్ర రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ సర్వే అండ్ బౌండరీస్ చట్టం, 1923లోని సెక్షన్ 6(1) ప్రకారం ఈ నెల 12 న జిల్లా గెజిట్ నెం.175 ద్వారా నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. భూ రికార్డులను ఆధునీకరించడం, సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించడం, భూ వివాదాలను తగ్గించడం, భూములకు సంబంధించిన సమాచారాన్ని పారదర్శకంగా నమోదు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ వెల్లడించారు.