ఆ ఎద్దు కోసం ఊరు ఊరే కదిలింది.. ఎందుకంటే..
యుపి (CLiC2NEWS): మనిషి సంఘజీవి. చుట్టు ఉన్న పరిసరాలతో పాటు తన చుట్టూ ఎన్నో బంధాలు, బంధనాలు ఏర్పరచుకుంటూ జీవనం సాగిస్తాడు. కొన్ని బంధాలు బంధువుల రూపంలో కష్టసమయంలో నేనున్నాను అని చేయి అందిస్తారు. ఇంకొందరు బంధువులు తమ అవసరం ఉన్నంత వరకు మాత్రమే ప్రేమాభిమానాలు ఒలకపోస్తూ, అవసరం వచ్చే సరికి చల్లగా జారుకుంటారు. ఈరోజుల్లో మనుషులకు మనుషులు సహాయం చేసుకునే రోజులు పోయాయి. ఎవరి స్వార్ధం వారిది. ఒక మనిషి బతికున్న సమయంలోనే ఆదుకోనివారు మరణించిన తరువాత కడసారి చూడ్డానికి కూడా రాని పరిస్థితి నెలకొంది.
ఇలాంటి రోజుల్లో మనుషులకే దిక్కులేప్పుడు ఇక పశువులు మరణిస్తే వస్తారా.. ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఎవరి బిజీ వారిది. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే స్వార్థం నిండిన ఈ ప్రపంచంలో ఒక ఎద్దు చనిపోతే ఊరు.. ఊరే తరలి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహా మనిషి మరణిస్తే ఎలాగైతే పుణ్యకార్యాలు నిర్వహిస్తారో ఆవిధంగానే ఆ ఎద్దుకు చేయాల్సిన పుణ్యకార్యాలు అన్ని నిర్వహించారు గ్రామస్తులు. ఆ ఎద్దుకు ఖననం చేశారు.
దాంతో సరిపెట్టకుండా ఏకంగా 3000 మందికి పైగా భోజనాలు ఏర్పాటు చేశారు గ్రామస్తులు. ఇంత వైభవంగా ఆ ఎద్దుకు ఎందుకు పుణ్యకార్యాలు చేస్తున్నారంటే..
యుపి శహరాన్‌పూర్‌లోని కుర్దీ అనే గ్రామంతో ఆ ఎద్దు 20 ఏళ్లుగా ఉంటోంది. ఆ ఎద్దు గ్రామంలో ఎవర్నీ ఎమీ అనేది కాదు. చిన్నపిల్లలతో కూడా ఆ ఎద్దుతో సరదాగా ఆడుకునేవారు. అందరితో కలిసిమెలిసి వారిలో ఒకటిగా జీవించింది.
గ్రామమంతా ఇంత ప్రేమ చూపించే ఆ ఎద్దు ఎక్కడి నుంచి వచ్చిందో గ్రామస్తులకు ఎవరికీ తెలియదు.. కానీ ఆ గ్రామంలోని ఓ పవిత్రమైన ప్రాంతంలో సడెన్ గా ఒకరోజు ఆ ఎద్దు కనిపించిందట. అప్పటి నుంచి ఆ గ్రామంలోనే ఉండిపోయింది. దానిని శివుని వాహనమైన నంధీశ్వరుడి అవతారంగా భావించి గ్రామంలోని ప్రజలు దానికి పూజలు చేసేవారు. అందుకే ఆ ఎద్దు అంటే ఆ గ్రామంలోని వారికి అంతటి మమకారం. సడెన్‌గా చనిపోయిన ఎద్దు పుణ్యకార్యాల కోసం గ్రామంలోని ప్రజలంతా చందాలు వేసుకొని పుణ్యకార్యాలు నిర్వహించారు.