TS: పాఠ‌శాల‌లు ఫీజులు పెంచొద్దు

ట్యూషన్‌ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి.. ఉత్త‌ర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్య‌ద‌ర్శి

హైదరాబాద్ (CLiC2NEWS): కొత్త విద్యా సంవ‌త్స‌రం (2021-22)లోనూ రాష్ట్రంలోని అన్ని బోర్డుల ప‌రిధి ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు ఫీజులు పెంచ‌రాద‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. రాష్ట్ర పరిధిలోని స్కూళ్లతో పాటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సహా ఇతర ఇంటర్నేషనల్‌ బోర్డుల నుంచి గుర్తింపు పొందిన స్కూళ్లన్నీ ఆదేశాలను పాటించాలని పేర్కొన్నది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా సోమవారం జీవో 75 జారీచేశారు. గత ఏడాది (2020-ఏప్రిల్‌)జారీ చేసిన జీవో 46 ప్రకారమే స్కూళ్లు నడుచుకోవాలని జీవోలో పేర్కొన్నారు.

కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఫీజులు పెంచడానికి వీల్లేదని స్పష్టంచేసింది. తెలంగాణ విద్యా సంస్థ‌లు (స్థాప‌న‌, గుర్తింపు, ప‌రిపాల‌న‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల నియంత్ర‌ణ‌) నిబంధ‌న‌లు 1993 ప్ర‌కారం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొంది.

జీవో ప్ర‌కారం 2019-20లో ఉన్న ట్యూషన్‌ ఫీజులు మాత్రమే ఇప్పుడూ తీసుకోవాల్సి ఉంటుంద‌ని అధికారి ఒక‌రు చెప్పారు. ప్ర‌తీ ఏడు 8-15 శాతం ఫీజులు ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు పెంచుతుంటాయ‌ని, రెండేళ్లు పెంచ‌కుంటే 16-30 శాతం త‌గ్గించిన‌ట్లేన‌ని ఆయ‌న విశ్లేషించారు.

ట్యూషన్ ఫీజులు మాత్ర‌మే వసూలు చేయాలని, అది నెలవారీగా మాత్రమే తీసుకోవాలని స్పష్టంచేశారు. నిబంధనలను పాటించని విద్యాసంస్థల గుర్తింపును రద్దుచేస్తామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.