ఇంట్లోనూ మాస్క్ మస్ట్! తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్
హైదరాబాద్: ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్నదని, ఇంట్లో ఉన్నా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు స్పష్టంచేశారు. గతంలో కరోనా ఒక వ్యక్తికి సోకితే అతని వరకే పరిమితం అయ్యేదని, కానీ ప్రస్తుత వైరస్ తీవ్రత కారణంగా ఇంట్లో ఒకరికి సోకితే గంటల్లోనే కుటుంబసభ్యులకు అంటుకొనే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. అవరమైతే ఇంట్లోనూ మాస్క్ ధరించాలని సూచించారు. ఈ పరిణామాలను బట్టి వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదని, ప్రజలు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందేనని స్పష్టంచేశారు.
బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నాలుగు వారాలుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరో ఆరు వారాలు ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రజలు సహకరించకపోతే తెలంగాణ కూడా మహారాష్ట్ర మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ముందు ముందు ఆస్పత్రిలో బైట్సు దొరక్కుండా పోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక ఇబ్బందులు రావద్దని లాక్ డౌన్ కర్ఫ్యూ వంటివి పెట్టడం లేదు కానీ తెలంగాణలో పరిస్థితి తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి ఇప్పుడు ఉన్న వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుందని ఆయన అన్నారు.