ఒకే కుటుంబంలో 21 మందికి కొవిడ్
రాజమండ్రి: దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా గత వారం పది రోజుల నుంచి కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గురువారం 700 లకు పైగా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి మండలంలోని ఓ కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తొండంగి ఓ ఇంట్లో నిర్వహించిన భజన కార్యక్రమంలో మరో నాలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. వీరిలో కొందరికి జ్వరం రావడంతో పరీక్షించగా 21 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాజమండ్రిలోని ఓ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్ధి ఇటీవలే ఇంటికి వెళ్లాడు. ఆ విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఆ విద్యార్థి నుంచి మిగతా కుటుంబసభ్యులకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు ఆ కుటుంబసభ్యులకు చికిత్స అందిస్తున్నారు.