నివర్ తుఫాన్: భారీగా కురుస్తున్న వర్షాలు
చెన్నై/ విశాఖపట్టణం : నివర్ తుపాను పుదుచ్చేరి సమీపాన బుధవారం అర్ధరాత్రి తీరాన్ని తాకింది. తమిళనాడు ఉత్తర తీర ప్రాంతం, పుదుచ్చేరి వాయువ్య దిశగా కదులుతోంది. దీంతో ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర, రాయలసీమ బెంగుళూరు, తెలంగాణల మీద ప్రభావం పడనుంది. ఉత్తరకోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను సముద్ర తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. తుపాను అలజడికి తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చెన్నై సముద్ర తీరంలో అలలు ఎగసిఎగసిపడుతున్నాయి. పలు చోట్ల సముద్రం ముందుకొచ్చింది. తమిళనాడులో ఇప్పటికే లక్షకు మందికి పైగా లోతట్టు ప్రజలను తరలించారు. భారీ గాలులు, వర్షాల కారణంగా గురువారం వరకు విద్యాసంస్థలు మూసివేశారు. చెన్నై విమానాశ్రయం, మెట్రో సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.
తీవ్ర తుపానుగా మారిన నివర్…మరి కొన్ని గంటల్లో బలహీనపడవచ్చు. తుపాన్ కారణంగా పుదుచ్చేరి, తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరిలో 237 మిమీ వర్షపాతం నమోదు కాగా, తమిళనాడులోని కడలూరులో 237 మిమీ వర్షపాతం నమోదైంది. 1.45 మంది ప్రజలను 1,156 పునరావాస కేంద్రాలకు తరలించామని రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రి ఆర్ బి ఉదయ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని సముద్ర తీరం ఎక్కువగా ఉన్న కడలూరు, నాగపట్నం జిల్లాలోని ప్రజలను అధికంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న నష్టాల గురించి సమాచారం రావాల్సి ఉందని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజలను వీలైనంత వరకు ఇంట్లోనే వుండాలని ముఖ్యమంత్రి ఇ.పళనిస్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 4వేల ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి, అధికారులను అప్రమత్తము చేసినట్లు చెప్పారు. ఇప్పటికే వర్షాలకు రిజర్వాయర్లు నిండిపోతుండటంతో….నీటిని కిందకు వదులుతున్నారు.
తిరుమలలో భారీ వర్షం
నివర్ తుపాను చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ‘నివర్’ తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రెండో ఘాట్ రోడ్ హరిణి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది జేసీబీ సాయంతో కొండచరియలను తొలగిస్తున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్సానికి శ్రీవారి ఆలయంలోకి వర్షపు నీరు చేరాయి. దీంతో సిబ్బంది మోటార్ల సహాయంతో నీటిని బయటకు పంపుతున్నారు. బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ప్రహారీ గోడ కూలగా, బైక్లు ధ్వంసం అయ్యాయి.