ఒక్కరోజే 1.45 లక్షల మందికి కరోనా
794 మరణాలు.. 10 లక్షలు దాటిన క్రియాశీల కేసులు
న్యూఢిల్లీ : భారత్లో కరోనా ఉధృతి ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,73,219 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,45,384 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఈ మేరకు శనివారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో మహమ్మారి బారినపడి 794 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి
ఇప్పటి వరకు వైరస్ బారినపడి 1,68,436 మంది ప్రాణాలు విడిచారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,32,05,0926కు చేరాయి. తాజాగా 77,567 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా ఇప్పటి వరకు మొత్తం 1,19,90,859 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 10,46,631 క్రియాశీల కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.