త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల పెంపు: సిఎం కెసిఆర్
జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు శుభవార్త
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచి రాష్ర్ట సాధనలో భాగస్వాములైన ఆర్టీసీ ఉద్యోగుల కు సిఎం కెసిఆర్ శుభవార్త వినిపించారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని ఉద్యోగ సంఘాలు పోరాటం చేశాయి. ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరవలేనిది. ఆర్టీసీ ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదు. ఆర్టీసీని కాపాడుతున్నాం. బడ్జెట్లో రూ. 3000 కోట్లు కేటాయించాం. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్లే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచుతాం. రవాణా శాఖ మంత్రితో త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు శుభవార్త
అలాగే రాష్ర్టంలోని జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. అందరి ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ఈ ఏప్రిల్ నుంచే రెగ్యులర్ జీతాలు ఇస్తామన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా చేయడం వల్లే గ్రామాలు బాగు చెందుతున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు బతుకుతున్నాయి. అందరూ పంచాయతీ సెక్రటరీల మాదిరిగానే.. జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఈ ఏప్రిల్ నుంచే రెగ్యులర్ పీఎస్‌లకు ఇచ్చిన జీతాలు ఇస్తాం. కానీ ప్రొబేషనరీ పీరియడ్‌ను మరో ఏడాది పెంచుతాం.. కడుపు నిండా జీతం ఇస్తాం అని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.