31న జనగామలో రైతు వేదిక ప్రారంభం

జనగామ: జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికను ప్రారంభించనున్నారు. అనంతరం రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సీఎం సందర్శిస్తారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశాన్ని, రైతు వేదికల ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను సీఎం ప్రజలకు వివరిస్తారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను కార్యక్రమానికి ఆహ్వానించారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమానికి హాజరుకానున్నారు. రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటలపై చర్చించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను నిర్మిస్తోంది. ఆన్‌లైన్‌లో సీఎం కేసీఆర్ నేరుగా రైతులతో మాట్లాడేలా.. రాష్ట్రవ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 వేదికలను నిర్మిస్తున్నారు. సమావేశాలు, చర్చలు నిర్వహించడంతోపాటు గోడౌన్‌గా ఈ వేదికలను ఉపయోగించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.