122 ఎకరాల్లో 4868 మందికి ఇళ్ల పట్టాలు..
వేములపల్లి గ్రామంలో పండుగ వాతావరణం..
మండపేట: రాష్ట్ర చరిత్రలో పెద్ద మొత్తంలో నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చిన ఘనత యువ ముఖ్యమంత్రి, డైనమిక్ లీడర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి అని మండపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి తోట త్రిమూర్తులు వెల్లడించారు. శనివారం మండపేట రూరల్ మండలం వేములపల్లి గ్రామంలో నిరుపేదలకు పెద్ద ఎత్తున స్థలాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండపేట లో ఇతర గ్రామాల నుండి వచ్చిన వేలాది మంది లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్ టీ రామారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి లకు ధీటుగా జగన్ పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశమంతటా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అన్నారు. నిరుపేదలకు ఈనాటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు గతంలో ఎన్నడూ పంపిణీ చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 26 వేల కోట్లు ఇళ్ల స్థలాలకు వెచ్చించారు అన్నారు. పేదల అవసరాలకు అనుగుణంగా పని చేసే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎల్లవేళలా గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.
తాను నాలుగు పర్యాయాలు శాసనసభ్యునిగా పనిచేశానని అయితే జగన్మోహన్ రెడ్డి వద్దనున్న సిన్సియారిటీ, డైనమిజం, మాటమీద నిలబడే వ్యక్తిత్వం ఇంకెవరి వద్ద చూడలేదన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పదవి రావాలంటే 2009లోనే వచ్చి ఉండేదని ఆయన అన్నారు. ఆయన పదవుల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదని ప్రజా సంక్షేమమే తన ధ్యేయం అంటూ పని చేశారన్నారు. 2009 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు సోనియా గాంధీ జగన్ కు కేంద్ర మంత్రివర్గంలో చేరవలసిందిగా ఆహ్వానించారని అయితే ఆయన తాను ప్రజల నుండే ఏనాటికైనా ముఖ్యమంత్రి అవుతానని కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నారన్నారు.
మండపేట గొల్లపుంత కాలనీ లో నిర్మించిన గృహాలకు 300 చదరపు గజాలు ఉన్నవారికి కేవలం ఒక్క రూపాయి కడితే చాలని తోట త్రిమూర్తులు ఈ సందర్భంగా వెల్లడించారు. గతంలో 50,000 చెల్లించిన లబ్ధిదారులకు 25 వేల రూపాయలు ప్రభుత్వం వెనక్కి ఇచ్చి వేస్తుందని, అదేవిధంగా లక్ష రూపాయలు చెల్లించిన లబ్ధిదారులకు 50 వేల రూపాయలు తిరిగి లబ్దిదారులకు చెల్లిస్తున్నట్లు ఆయన హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అయితే వీటిని వక్రీకరించి తెలుగుదేశం నాయకులు విస్తృత ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

మండపేట నియోజకవర్గం లో డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి శాసన సభ్యునిగా ఉన్న కాలంలో మాత్రమే మండపేట నియోజకవర్గ ప్రజలకు 5000 ఇళ్ల స్థలాలు వచ్చాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గొల్లపుంత లో ఇచ్చిన ఇళ్ల స్థలాలు అన్నీ శాసనసభ్యుడు బిక్కిన హయాంలో ఇచ్చినవేనని ఉద్ఘాటించారు. గొల్లపుంత కాలనీలో ఇండ్లకు మౌలిక వసతులు కల్పించడానికి టెండర్లు పిలవనున్నట్లు తోట త్రిమూర్తులు వెల్లడించారు. అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింత అనురాధ పార్లమెంటు లోని గ్రామాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారని ఆయన వివరించారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన అమలాపురం ఎంపీ చింత అనురాధ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలన సంక్షేమ పాలనని ఆయన పాలనలో ప్రజలు అందరూ ఎంతో సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆమె వివరించారు. వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ మండపేట లో నివసించే లబ్ధిదారులకు మండపేట లోనే ఇళ్లస్థలాలు ఇస్తే ఎంతో బాగుండేదని ఆయన పేర్కొన్నారు. ఇళ్లు లేని వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం తనకు కూడా సంతోషమే అన్నారు. మాజీ శాసనసభ్యులు డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట ఇస్తే మడమ తిప్పని గొప్ప మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. రెడ్డి రాధా కృష్ణ, కర్రి పాపారాయుడు, వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, దూలం వెంకన్నబాబు జగన్ పాలన ను వివరించారు.
శనివారం నియోజకవర్గంలో నాలుగు వేల 4863 మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. వీటిలో మండపేట పట్టణంలో 2247 మంది ఏడిద సీతానగరం గ్రామంలో తొమ్మిది మందికి ఏడిద గ్రామంలో 712 మందికి, వెలగతోడు గ్రామంలో 50 మందికి ఇవ్వగా తాపేశ్వరం గ్రామంలో 277 మంది పట్టాలు అందుకున్నారు. మారేడుబాక గ్రామంలో 276 మంది కి ఇప్పనపాడు గ్రామంలో 250 మందికి జెడ్ మేడపాడు గ్రామంలో 49 ద్వారపూడి గ్రామంలో 567 మందికి అర్తమూరు గ్రామంలో 426 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు టి రాజేశ్వర రావు, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, ఎంపీడీవో అయిదం రాజు, గృహనిర్మాణ శాఖ అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.