ఒంగోలులో విషాదం.. నీటి కుంటలో మునిగి నలుగురు చిన్నారులు మృతి
ఒంగోలు (CLiC2NEWS): నీటి కుంటలోకి సరదాగా స్నానానికి దిగిన నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో చోటుచేసుకుంది. అభిరామ్, సుశాంత్ , చిన్ను, దినేష్ ఉదయం ఇంటి నుండి వెళ్లారు. మధ్యాహ్నం అయినా సరే ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం గ్రామంలో వెతుకుతున్నారు. ఈ క్రమంలో నీటి కుంట వైపు వెళ్లిన స్థానికులు చిన్నారుల దుస్తులు, చెప్పులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. చిన్నారుల కుటుంబసభ్యులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని , కుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. నలుగురు నీటిలో మునిగి చాలా సమయం కావడంతో నలుగురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారుల మృతదేహాలను వెలుపలకు తీసి, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారులందరూ 10 నుండి 14 ఏళ్ల మధ్య వయస్సు వారే. చిన్నారుల మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరణించిన వారిలో అభిరామ్, సుశాంత్ అన్నదమ్ములు.