మంచిర్యాల: నంబర్ ప్లేట్లు లేని వాహనాలు సీజ్

12 ద్విచక్ర వాహనాలు సీజ్.. 40 వాహనాలకు జరిమానా..

మంచిర్యాల (CLiC2NEWS):  పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు నంబర్ ప్లేట్లు లేని వాహ‌నాల‌పై ప్ర‌త్యేక నిఘా ఉంచారు. నంబ‌ర్ ప్లేట్లు లేకుండా, అస్పష్టమైన నంబర్ ప్లేట్లతో లేదా నంబర్ ప్లేట్లను టాంపరింగ్ చేసి వాహనాలు నడుపుతున్న వారిపై మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం మంచిర్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హనన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 12 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడంతో పాటు,40 వాహనాలకు జరిమానాలు విధించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ హనన్ మాట్లాడుతూ, వాహనదారులందరూ ఆర్టీఏ నిబంధనల ప్రకారం తమ వాహనాలకు స్పష్టంగా కనిపించే నంబర్ ప్లేట్లను తప్పనిసరిగా అమర్చుకోవాలని సూచించారు. ఇకపై కూడా నంబర్ ప్లేట్ల నిబంధనలపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, రోడ్డు భద్రతకు సహకరించాలని ట్రాఫిక్ సిఐ కోరారు.

Leave A Reply

Your email address will not be published.