రెండు సంవత్సరాల్లో బిసి రాజ్యం తెస్తా.. తీన్మార్ మల్లన్న

సెప్టెంబర్ 17 నుండి అసలైన యుద్ధం

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): సెప్టెంబర్ 17న తెలంగాణ రాజ్యాధికార పార్టి (TRP) పార్టీ ఆవిర్భవించి సంవత్సరం పూర్తవుతున్ననేప‌థ్యంలో న‌గ‌రంలోని ఓ ఫంక్ష‌న్ హాల్‌లో టిఆర్‌పి పార్టి రాష్ట్ర విస్తృత స్థాయి స‌మావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సమావేశ ప్రారంభంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్ యాదవ్ సమావేశ ఎజెండాను ప్రవేశపెట్టి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై వివరించారు.

ఈ సంద‌ర్బంగా సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణలో అసలైన రాజకీయ యుద్ధం ప్రారంభం కానుందని ప్రకటించారు. సెప్టెంబ‌ర్ 17 నుండి బిసిల రాజ‌కీయ అధికార సాధ‌న కోసం రాష్ట్ర వ్యాప్తంగా మ‌హా పాద‌యాత్ర ను ప్రారంభిస్తున్న‌ట్లు మాదం ర‌జనీ కుమార్ యాద‌వ్ తెలిపారు. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలు కొద్దిమంది రెడ్డి,వెలమ వర్గాల చేతుల్లో బందీగా మారాయని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు జనాభాలో అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ అధికారంలో మాత్రం వారికి తగిన ప్రాతినిధ్యం దక్కలేదని అన్నారు, ఈ పాదయాత్రతో బీసీలకు రాజ్యాధికారం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. “రెండు సంవత్సరాల్లో బిసి రాజ్యం తెస్తా” అంటూ మల్లన్న స్పష్టం చేశారు. “80 ఏండ్ల దోపిడి పాలనకు ముగింపు” పలకడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ లక్ష్యమని మల్లన్న పేర్కొన్నారు.

పాదయాత్ర కేవలం రాజకీయ కార్యక్రమం కాదని, సామాజిక చైతన్య యాత్ర అని మల్లన్న అన్నారు. ఈ యాత్రలో బిసిలకు జరిగిన అన్యాయాలు, అవకాశాల దోపిడీ, రాజకీయ అధికార కేంద్రీకరణ గురించి గడప గడపకు వివరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాయకుల నుంచి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు అందరూ సమన్వయంతో పని చేసి పాదయాత్రను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.“నేను చనిపోయినా కూడా ఈ ఉద్యమం ఆగదు” అని స్పష్టం చేశారు మల్లన్న.ఇది వ్యక్తుల ఉద్యమం కాదని,తరాల అణిచివేత,దోపిడి,అసమానతలపై చేస్తున్న ఉద్యమమని అన్నారు. బిసిల రాజకీయ అధికారం సాధించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని..2028లో తెలంగాణలో బిసి జెండా ఎగరేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి.. నిందితుడికి 10 ఏళ్లు జైలుశిక్ష

Leave A Reply

Your email address will not be published.