జంగారెడ్డి గూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం
జాంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా జాంగారెడ్డి గూడెం వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బుట్టాయిగూడెం వద్ద నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషయమంగా ఉండటంతో వారిని విజయవాడ తరలించారు. బాధితులంతా కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందిన వారు. వీరంతా వ్యవసాయ కూలీలు. కాగా ఆదివారం గుబ్బలమంగమ్మతల్లి గుడికి మూడు ట్రక్టర్లపై బయలుదేరారు. ఈ క్రమంలో జంగారెడ్డి గూడెం బైపాస్ రోడ్డు శ్రీనివాసపురం కూడలి వద్దకు చేరుకోగానే తెల్లవారు జామున 4 గంటల సమయంలో రాజమండ్రి వైపు నుంచి ఖమ్మం వెళ్తున్న లారీ అప్పుడే రోడ్డు పైకి వస్తున్న వీరి ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. బలంగా ఢీ కొనడంతో ఇంజన్ ట్రక్కు నుంచి విడిపోయి 100 గజాల దూరంలో పడింది. ట్రక్కులో ఉన్నవారంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.