ఇక జీపీఎస్‌తోనే టోల్..
ఏడాదిలోగా టోల్ ప్లాజాలు తొలగిస్తాం: లోక్‌సభలో కేంద్రమంత్రి గడ్కరీ
టోల్ ప్లాజాలు మాయం.. ఇక జీపీఎస్‌తోనే టోల్ సేకరణ
న్యూఢిల్లీ: మరో ఏడాదిలోపు ఇండియాలో టోల్ ప్లాజాలు మొత్తం ఎత్తేస్తామని, జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణ చేపడతామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇప్పటి వరకూ దేశంలో 93 శాతం వాహనాలు ఫాస్టాగ్ వాడుతున్నాయని, మిగిలిన 7 శాతం వాహనాలకు రెట్టింపు టోల్ వేసినా ఇంకా ఫాస్టాగ్ తీసుకోలేదని ఆయన తెలిపారు. మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. టోల్ ప్లాజాల స్థానంలో పూర్తి జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణను తీసుకొస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభలో మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ… `ఒక సంవత్సరంలో దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు తొలగిస్తామని సభా వేదికగా హామీ ఇస్తున్నా. అంటే ఇకపై జీపీఎప్ ఆధారంగా టోల్ వసూళ్లు చేపట్టనున్నాం. వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం` అని గడ్కరీ వివరించారు.
ఇక ఫాస్టాగ్‌ల ద్వారా టోల్ చెల్లించని వాహనాలపై తాము పోలీసు విచారణకు ఆదేశించినట్లు కూడా ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ చెప్పారు. వాహనాలకు ఫాస్టాగ్ లేకపోవడం వల్ల టోల్ చోరీ, జీఎస్టీ ఎగవేయడంలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2016లో తొలిసారి ప్రవేశపెట్టిన ఈ ఫాస్టాగ్‌లను గత నెల 16 నుంచి తప్పనిసరి చేశారు. ప్రస్తుతం 93 శాతం వాహనాలు ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించి టోల్ చెల్లిస్తున్నారు, మిగిలిన 7 శాతం మంది రెట్టింపు టోల్ చెల్లిస్తున్నప్పటికీ ఇంకా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోలేదని పేర్కొన్నారు. ఫాస్ట్ ట్యాగ్స్ ఉపయోగించి టోల్ చెల్లించని వాహనాల కోసం పోలీసు విచారణకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. వాహనాల్లో ఫాస్ట్‌ట్యాగ్‌లు అమర్చకపోతే టోల్ దొంగతనం, జీఎస్టీ ఎగవేత కేసులు పెట్టనున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు.