ఎపిలో డిపోలకే పరిమితమైన బస్సులు
అమరావతి: కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు శుక్రవారం భారత్ బంద్ చేపట్టాయి. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో రవాణా స్తంభించింది. రైతు మద్దతు దారులు రోడ్లపై బైఠాయించి నిరసనకు దిగారు.
ఆంధ్రప్రదేశ్ లో భారత్ బంద్ కొనసాగుతోంది. రాష్ట్రంలో బీజేపీ, జనసేన మినహా అన్ని పార్టీలు బంద్ కు మద్దతు ఇవ్వడంతో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోవడంతో ప్రజా రవాణా స్తంభించి పోయింది. వ్యాపార సంస్థలు సైతం మూతపడ్డాయి. మధ్యాహ్నం ఒంటిగంట తరువాతే బస్సులు డిపోల నుంచి బయటకు కదిలే అవకాశం ఉన్నది. ఏపీ ప్రభుత్వం సైతం బంద్ కు మద్దతు ఇవ్వడంతో వైసీపీ శ్రేణులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నెల రోజుల కాలంలో రైతులు భారత్ బంద్ కు పిలుపునివ్వడం ఇది రెండోసారి. రవాణా సర్వీసులు లేకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు డిపోల పరిధిలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్టీసీ డిపోల వద్ద వామపక్షాలు నిరసన తెలిపాయి. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్షాల ఆందోళన చేపట్టాయి. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న బంద్ కొనసాగుతోంది. బస్ డిపోల వద్ద పలు పార్టీల నాయకులు ఆందోళన నిర్వహించారు. విశాఖ జిల్లా మద్దిలపాలెం బస్టాండ్ వద్ద బంద్ నిర్వహిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. వామపక్షాలు, ప్రజాసంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బంద్ నేపథ్యంలో మధ్యాహ్నం వరకు బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి.