అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలి : హెల్త్ డైరెక్టర్
హైదరాబాద్: ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు. రాష్ట్రంలోనూ కరోనా వేగంగా విస్తరిస్తోందని ఆయన తెలిపారు. సెకండ్ వేవ్‌లో వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నదని చెప్పారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే 4 వారాల్లో కరోనా వ్యాప్తి తీవ్రరూపు దాల్చే ప్రమాదముందని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. రోగుల సంఖ్య పెరిగితే అందరికీ పడకలు దొరకడం కష్టమని అభిప్రాయ పడ్డారు. వచ్చే 4 వారాలు దేశానికి, రాష్ట్రానికి చాలా కీలకమని అన్నారు. ప్రజంతా విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, కరోనా కట్టడికి ఓవైపు వ్యాక్సినేషన్ పెంచిన సర్కార్ మరోవైపు కరోనాబారిన పడకుండా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రత అవసరం అని మళ్లీ మళ్లీ చెబుతున్న సంగతి తెలిసిందే.గత కొంతకాలంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.