ద్వారపూడి-మండపేట రహదారి మరమ్మతులకు జాయింట్ కలెక్టర్ హామీ..
మండపేట (CLiC2NEWS): ద్వారపూడి మండపేట రహదారి పరిస్థితిపై తాను చేసిన ఫిర్యాదుకు జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా సానుకూలంగా స్పందించారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ద్వంసం అయిన ద్వారపూడి రోడ్డును పట్టించుకోవాలని కాకినాడ కలెక్టరేట్ కు వెళ్ళి జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా, రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ కె.హరిప్రసాద్ లను తాను కలిశానని అన్నారు. వారికి నియోజకవర్గం లో పాడై పోయిన రోడ్ల గురుంచి మరీ ముఖ్యంగా ప్రమాదకరంగా మారిన ద్వారపూడి రోడ్డు పరిస్థితి కోసం వివరించానని చెప్పారు. నిత్యం ద్వారపూడి రోడ్డులో వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారని, భారీ గోతులు ఏర్పడటం వర్షాలు కురిసి గోతులు నుండి పోవడం వంటి పరిణామాల వల్ల ఎక్కడ ఏ గొయ్యి ఉందో తెలీక రోజూ పదుల సంఖ్యలో పడి పోయి ఆస్పత్రుల పాలవుతున్నారని జాయింట్ కలెక్టర్ కు వున్నవించడం జరిగిందన్నారు. అందుచేత నియోజక వర్గ ప్రజలు, ఇతర ప్రాంతాల నుండి ఈ రోడ్డు ద్వారా ప్రయాణించే వాహనదారులను దృష్టిలో ఉంచుకొని కనీసం తాత్కాలిక చర్యలకైనా ఉపక్రమించాలని జాయింట్ కలెక్టర్ లక్ష్మీషాను కోరానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు, ఆర్ అండ్ బి అధికారికి మండల కార్యదర్శి కంకటాల మురళీ కృష్ణతో కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశానని తెలిపారు. దీనికి జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారని కోన తెలిపారు. కాగా రోడ్డు నిర్మాణానికి 2020లో కేంద్రం సీఆర్ఎఫ్ నిధులు 25 కోట్లు మంజూరు చేసిందని వాటితో వీలైనంత త్వరగా కొత్త రోడ్డు నిర్మిస్తే ప్రజలు శాంతిస్తారని చెప్పానని అన్నారు.