ఉస్మాన్‌సాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత
ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఉస్మాన్‌సాగర్‌కు జలకళ
జలాశయానికి భారీగా చేరుతున్న వరదనీరు
మరో మూడు రోజులు వర్షాలు ఉంటాయని చెప్పిన వాతావరణ శాఖ
ఉస్మాన్‌సాగర్ నాలుగు గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తివేత
మూసీ నదిలోకి నీటి విడుదల
మూసీ పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎంపీ దానకిశోర్ సూచన

హైదరాబాద్ (CLiC2NEWS): ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్‌సాగర్ (గండిపేట) జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీనికి తోడు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో ఇవాళ (శనివారం) మధ్యాహ్నం ఒంటి గంటకు ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్ నాలుగు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 468 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ఈ సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివిధ శాఖల అధికారులను జలమండలి ఎండీ దానకిషోర్ సూచించారు. కాగా, ఈ సంవత్సరంలో ఉస్మాన్‌సాగర్ గేట్లు తెరవడం ఇది రెండోసారి. జులై 22న మొదటిసారి గేట్లు తెరిచి వరద ఉధృతి తగ్గడంతో 25న మూసివేశారు.
హిమాయత్‌సాగర్
హిమాయత్‌సాగర్ రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో నేడు రెండు గేట్లను మూసివేశారు. కాగా, మరో రెండు గేట్ల ద్వారా 700 క్యూసెక్కుల వరద నీటిని మూసీ నదికి వదులుతున్నారు.
జంట జలాశయాల వివరాలు (ప్రస్తుతం):
1. హిమాయత్ సాగర్ :
- హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
- ప్రస్తుత నీటి స్థాయి : 1761.75 అడుగులు
- రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.968 టీఎంసీ లు
- ప్రస్తుత సామర్థ్యం : 2.562 టీఎంసీ లు
- ఇన్ ఫ్లో : 800 క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో: 700 క్యూసెక్కులు
- మొత్తం గేట్ల సంఖ్య: 17 గేట్లు
- ఎత్తిన గేట్ల సంఖ్య: 2 గేటు
2. ఉస్మాన్ సాగర్:
- ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 1790.00 అడుగులు
- ప్రస్తుత నీటి స్థాయి : 1789.00 అడుగులు
- రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 3.90 టీఎంసీ లు
- ప్రస్తుత సామర్థ్యం : 3.671 టీఎంసీ లు
- ఇన్ ఫ్లో : 1100 క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో: 468 క్యూసెక్కులు
- మొత్తం గేట్ల సంఖ్య: 15 గేట్లు
- ఎత్తిన గేట్ల సంఖ్య: 4 గేట్లు