రామగుండం కమిషనరేట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్‌ (CLiC2NEWS): కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయక‌మ‌ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. బాపూజి జ‌యంతి వేడుక‌ల‌ను రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్‌లో ఆదివారం ఘ‌నంగా నిర్వ‌హించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పోలీస్ కమిషనర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ దేశానికి, తెలంగాణకు చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన దశాబ్దాల పాటు అలుపెరగని కృషి చేశారని తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇల్లు,ఆస్తులను సైతం అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న ప్రస్తుత కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గ్రామంలో జన్మించారని సిపి తెలిపారు.1952లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆయన, అనంతరం 1967, 1972 సంవత్సరాల్లో భువనగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారని పేర్కొన్నారు.1957 నుంచి 1960 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ, అనంతరం దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో ఎక్సైజ్, చేనేత, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా సేవలందించారని తెలిపారు.1969లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని సీపీ పేర్కొన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తూ ఇందిరాపార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టడంతో పాటు, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కూడా సత్యాగ్రహం నిర్వహించారని గుర్తుచేశారు.ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన ప్రదర్శించిన పోరాట పటిమ, త్యాగం,నిబద్ధత భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశసేవకు, ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సీపీ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి (అడ్మిన్) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి నాగేంద్ర గౌడ్,ఆర్‌ఐ మల్లేశం,వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది,ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read: అంగన్‌వాడి కేంద్రాల‌పై రిమార్కులు వ‌ద్దంటే.. లంచం డిమాండ్‌

Leave A Reply

Your email address will not be published.