దసరా.. సంప్రదాయాల స్వర్ణకాంతి

ఆధునిక జీవనానికి విజయ సందేశం!

దసరా అంటే కేవలం పండుగ కాదు.. తరతరాలుగా మన సంస్కృతిలో ప్రవహిస్తున్న ఆధ్యాత్మిక జీవనధార! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినంలో పాలపిట్ట దర్శనం శుభసూచకమని, జమ్మిచెట్టును పూజిస్తే పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని పెద్దలు విశ్వసిస్తారు. అజ్ఞాతవాస సమయంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై దాచారనే ఇతిహాస గాథ విజయదశమికి మరింత ప్రత్యేకతను చేకూరుస్తుంది. జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దలకు సమర్పించడం వెనుక దాగి ఉన్నది కేవలం ఆచారం కాదు.. పరస్పర ప్రేమ, గౌరవం, శుభాకాంక్షలను పంచుకునే భారతీయ జీవన సంస్కారం!

అయితే, ఆధునిక కాలంలో దసరా పండుగ మనకు అందిస్తున్న సందేశం మరింత విస్తృతమైనది. రావణ సంహారం అంటే పురాణాల్లోని ఓ రాక్షసుడి అంతం మాత్రమే కాదు.. మనిషిలోని అహంకారం, అసూయ, ద్వేషం, అవినీతి, అన్యాయాలపై అంతరంగం సాధించాల్సిన విజయం కూడా! పాలపిట్టను చూడటంలో శుభాన్ని ఆశించినట్లే.. ప్రకృతిని పరిరక్షించడంలోనూ మన భవిష్యత్తు శుభాన్ని దర్శించాలి.

జమ్మి ఆకును బంగారంగా పంచుకున్నట్లే.. జ్ఞానాన్ని, ప్రేమను, మానవత్వాన్ని సమాజమంతా పంచుకోవాలి. సంప్రదాయాలను గౌరవిస్తూనే మూఢనమ్మకాలకు దూరంగా, శాస్త్రీయ ఆలోచనలకు దగ్గరగా నడవాలి. పండుగల పరమార్థం ఆచారాలను ఆచరించడంలోనే కాదు.. వాటి వెనుక ఉన్న మంచిని మన జీవన విధానంలో ఆచరణలో పెట్టడంలోనూ ఉంది. అదే దసరా అందించే అసలైన ఆధ్యాత్మిక విజయం.. ఆధునిక సమాజానికి అవసరమైన విజయ సందేశం!

-ఎస్.వి.రమణా చార్య,
సెల్‌: +91 98498 87086
హైదరాబాద్

Also Read: CLiC2NEWS వీక్ష‌కుల‌కు విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు!

Leave A Reply

Your email address will not be published.