జలమండలి ఉద్యోగులకు ఆరోగ్యభద్రత
హెల్త్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్
5051 ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు వర్తింపు
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి ఉద్యోగులకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హెల్త్‌కార్డులను అందించారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్యభద్రత కోసం జలమండలి ఎండీ దానకిశోర్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం హెల్త్ ఇన్యూరెన్స్ కల్పించింది. దీంతో సోమవారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జలమండలి ఉద్యోగులు హెల్త్‌కార్డులను అందుకున్నారు.
మొత్తం 3,609 మంది ఉద్యోగులు, 894 మంది పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షన్లు అందుకుంటున్న 548 మందికి, సుమారు 10 వేల మంది వారి కుటుంబసభ్యులకు ఈ ఆరోగ్యబీమా వర్తించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న వెయ్యి ప్రముఖ ఆసుపత్రుల్లో ఇక నుంచి జలమండలి ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులు రూ.3 లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు పొందవచ్చు. ఉద్యోగి, పెన్షనర్‌తో పాటు వారిపై ఆధారపడే ఐదుగురు కుటుంబసభ్యులకు కూడా ఆరోగ్యబీమా వర్తిస్తుంది. హెల్త్ ఇన్యూరెన్స్‌కు సంబంధించి ప్రతీ యేటా రూ.6.78 కోట్ల ప్రీమియం మొత్తాన్ని జలమండలి చెల్లిస్తుంది.
హెల్త్ ఇన్సురెన్స్ ముఖ్యాంశాలు:
- జలమండలిలో పర్మనెంటు ఉద్యోగులుగా పని చేస్తున్న 3,609 మందికి, 894 మంది పెన్షన్‌దారులకు, 548 ఫ్యామిలీ పెన్షన్‌దారులకు హెల్త్‌కార్డులు మంజూరయ్యాయి.
- ఉద్యోగితో పాటు వారిపై ఆధారపడే జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు(25 ఏళ్ల లోపు మగపిల్లలు, అవివాహితులైన ఆడపిల్లలు), ఇద్దరు తల్లిదండ్రులకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది.
- పెన్షన్‌దారులతో పాటు వారి జీవితభాగస్వామి, వారిపై ఆధారపడే ఇద్దరికి ఆరోగ్య బీమా ఉంటుంది.
- అప్పుడే జన్మించిన ఉద్యోగుల పిల్లలకు కూడా బీమా వర్తిస్తుంది
- రూ.50 వేల వరకు ప్రసూతి సంబంధిత ఖర్చులు కూడా పొందవచ్చు.
- ఆన్యువల్ చెకప్‌కు కూడా హెల్త్ ఇన్సురెన్స్ వర్తిస్తుంది.
- ఆయుర్వేద చికిత్స(ఆయూష్), ఆంబులెన్సు ఛార్జీలకు కూడా బీమా వర్తిస్తుంది.
- అన్ని ఎమర్జెన్సీ వైద్య సేవలు, టెలీహెల్త్ సేవలకు కూడా ఈ బీమా సౌకర్యం ఉంటుంది.
- హెర్నియా, గర్భాశయ చికిత్స, దంత వైద్యం, పుట్టుకతో వచ్చిన వ్యాధుల చికిత్స, కాలేయ సంబంధ వైద్యం, ఈఎన్టీ వైద్య సేవలు, చర్మవ్యాధులకు సంబంధించిన వైద్యానికి కూడా బీమా వర్తిస్తుంది.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, సీజీఎంలు విజయ రావు, ఖాదర్, ఉద్యోగులు, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ రాంబాబు యాదవ్, అసోసియేషన్ ప్రెసిడెంట్ కె. రాజిరెడ్డి, జనరల్ సెక్రెటరీ బి. జైరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ జి. లక్ష్మీనారాయణ, సయ్యద్ అక్తర్అలీ, రామచంద్రరెడ్డితో పాటు ఇతర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.