కరోనాతో కన్నుమూసిన నటుడు వేణుగోపాల్..
హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా తెలుగు సినీ పరిశ్రమ మరో నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో కన్నుమూశారు. ఆగస్టు నెలలోనే వేణుగోపాల్‌ను కరోనా కాటేసింది. కరోనా బారినపడటంతో గత 22 రోజులుగా గచ్చిబౌలిలోని ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న (బుధవారం) వేణుగోపాల్ కు తీవ్ర గుండెపోటు రావడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించి కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్ ఎఫ్‌సిఐ లో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందార్, తదితర సినిమాలతోపాటు పలు సీరియళ్లలోనూ కనిపించారు. అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. ఆఖరుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అమీతుమీ సినిమాలో కనిపించారు. వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్ మంచి నటుడిని కోల్పోయిందంటూ తమ సంతాపాన్ని ప్రకటించారు.